22, మార్చి 2016, మంగళవారం

"విలువలు+ విజ్ఞానం = వివేకం " అవగాహన కార్యక్రమ చిత్రమాలిక - మా బడిలో జాతీయ సైన్సు దినోత్సవ వేడుకల సందర్భంగా......

మా బడిలో జాతీయ సైన్సు దినోత్సవ వేడుకల సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన "విలువలు + విజ్ఞానం = వివేకం"(Values + Science or Knowledge = Wisdom) అనే అవగాహన సదస్సు  మరియు జాతీయ సైన్సు దినోత్సవ ఆవిర్భావానికి కారణమైన రామన్ ఫలితం మరియు సర్ సి.వి.రామన్ గారి గురించి అవగాహనా   సమావేశానికి  ముఖ్య అతిథులుగా కల్యాణదుర్గం ఆర్డీవో శ్రీ రామారావు గారు, శెట్టూరు తహసిల్దార్ శ్రీమతి శ్రీవాణి గారు, కనుకూరు గ్రామ సర్పంచ్ శ్రీ రామన్న గారు, కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు శ్రీ అక్బర్ గారు, వారి విభాగ అధిపతి శ్రీమతి గోపీ కృష్ణవేణి గారు, రసాయనశాస్త్ర విభాగ అధిపతి శ్రీమతి హర్ష లత గారు, బ్రహ్మసముద్రం మండలం గుండుగానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ  మల్లిఖార్జున గారు, కనుకూరు మోడల్ ప్రైమరీస్కూలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రీ నాగరాజు గారు, శ్రీ రాఘవేంద్ర గారు, కల్యాణదుర్గం మండలం మోరేపల్లి కొత్తూరు ఉపాధ్యాయులు శ్రీ బాలరామమోహన్ గారు , గ్రామ మాజీ సర్పంచ్ హనుమంత గౌడ్ గారు విచ్చేశారు. తొలుత ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్యాణదుర్గం ఆర్డీవో రామారావు గారు మా బడి పిల్లల్ని ఉద్ధేశించి మాట్లాడుతూ  పిల్లలు ముఖ్యంగా మూడు విషయాలు  చిన్నప్పటి నుంచే  అంటే పాటశాల స్థాయి నుంచే అలవరచు కోవాలని అవి 1. నైతిక విలువలు, 2. మంచి అలవాట్లు,  ౩. నాణ్యమైన చదువు అని తెలియ చేసారు. మొదటి అంశమైన నైతికవిలువలుకు  ఉదాహరణగా పిల్లలు అపద్దాలు చెప్పకూడదని పిలుపునిచ్చారు. ఈనాటి ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యా వైజ్ఞానిక  అంశాలతోపాటూ స్వామీ వివేకానందుని చిత్రమాలిక మరియు స్వామీ వివేకానంద పుస్తకాలు ప్రదర్శనకు, అమ్మకాలకు ఉంచి విజ్ఞానం విలువలు రెండూ  రెండు కళ్ళవంటివనీ, నేటి తరం విద్యార్థులకు అవి రెండూ ఎంతో అవసరమని తెలియచేసారు. అలాగే ఆనాటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఏర్పాటుచేసి ప్రదర్శించిన అంశాలలో ఒకటైన  "పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం" (smoking is injurious to health) అనే అంశం తనను చాలా బాగా ఆకట్టుకున్నదని తెలియచేస్తూ, జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాటశాల పిల్లలందరితో  "మేము పొగత్రాగము"  అని  ప్రతిజ్ఞ చేయించే కార్యక్రమం తన మనసులో ఉందని, ఆ కార్యక్రమాన్ని మన  కనుకూరు ఉన్నత పాటశాల పిల్లలతోనే ప్రారంభింస్తే బాగుంటుందని చెప్పి  ఆదిశగా ఆలోచించమని మాకు సూచించారు. అలాగే ఇటువంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను డివిజన్ కేంద్రమైన కల్యాణదుర్గంలో డిగ్రీ కళాశాల వారి సమన్వయంతో నిర్వహించాలని మా బడి పిల్లలు అలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటే బాగుంటుందని ఆ దిశగా ఆలోచించమని ఆ సమావేశ వేదికపై వున్న  డిగ్రీ కళాశాల అధ్యాపకులను కోరారు.   ఆర్డీవో  శ్రీ రామారావు గారు ఒకవైపు అంతకుముందు రోజే లేపాక్షి ఉత్సవాలలో పాల్గొని రాత్రి ఆలశ్యంగా ఇంటికిచేరి బడలికతో ఉన్నా,  మరోవైపు డివిజినల్ స్థాయిలో మండల తహసిల్దార్లతో  నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా మా అభ్యర్థనను మన్నించి, ప్రభుత్వ బడులనూ, ప్రభుత్వ బడులలో పిల్లల్నీ,  ప్రభుత్వ బడుల ఉపాధ్యాయులనూ ప్రోత్సహించాలనే సదుద్దేశంతో (తానూ స్వంతంగా మనసులో సంకల్పంతో ఏర్పరచుకున్న "రామారావ్ విద్య మిషన్" ప్రక్రియలో భాగంగా ) డివిజన్ కేంద్రానికి అత్యంత దూరములో (35 కిలోమీటర్లు) ఉన్న మాబడికి  విచ్చేసి మా బడి పిల్లల్ని, మమ్మల్ని ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆశీర్వదించిన శ్రీ రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే శ్రీ రామారావు గారు కోరుకున్న విధంగా ఉన్నత పాటశాల విద్యార్థులతో  మేము పోగాత్రాగము అనే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని త్వరలోనే ఆచరణలోకి తీసుకొచ్చి మొదట మా బడి పిల్లలతో తరువాత మండలం, డివిజన్ మరియు జిల్లా స్థాయిలో ఉన్న అన్ని  ఉన్నత పాటశాలల విద్యార్ధులందరితో చేపట్టే విధంగా వారి సహకారంతోనే కృషి చేస్తామని తెలియచేసుకుంటున్నాను. తరువాత మా మిత్రుడు శ్రీ అక్బర్ గారు మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవ ఆవిర్భావానికి కారణమైన రామన్ ఫలితం గురించి, సర్  సి.వి. రామన్ గారి గురించి క్లుప్తంగా వివరించారు. భారతదేశంలోని తొలితరం  శాస్త్రవేత్తలు చరకుడు, ధన్వంతరి మొదలు ఆధునిక శాస్త్రవేత్తలైన డాక్టర్ రాజ్ రెడ్డి, రాజారామన్న, స్వామినాథన్ల గురించి చెప్పారు. అంతే కాకుండా మారు మూల గ్రామాలలో పుట్టి, కటిక  పేదరిక నేపథ్యం నుంచి ఎంతో ఇష్టంతో చదువుకొని జాతీయ స్థాయిలో రాణించిన మరియు రాణిస్తున్న రాయలసీమకు చెందిన వృక్షశాస్త్ర ప్రోఫెసర్లై అనేక పుస్తకాలు వ్రాసి, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో  వివిధ విద్యా  సంబంధ శాఖలకు నేతృత్వం వహించిన    తమ్మినేని పుల్లయ్య గారు, సుంకర రామంజులు గారు, చింత సుధాకర్ గార్ల గురించి మా బడి పిల్లలకు  చెప్పి వీరు కూడా మీరున్నటువంటి మారు మూల పల్లెలాంటి పల్లెలనుండే వచ్చి పేదరికాన్ని ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరారని  కనుక మీరు కూడా అలాగే ఇష్టపడి కష్టపడి చదివి బడికి, ఉపాధ్యాయులకు, గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరారు. మరోసారి మా కనుకూరు బడికి వచ్చి ఒకరోజంతా పిల్లలకు సైన్సు సంబంధించిన విషయాలు చర్చిస్తానని చెప్పారు, వీరి తరువాత శ్రీమతి గోపీ కృష్ణ వేణి మేడం గారు, శ్రీమతి హర్షలత మేడం గారు మాట్లాడుతూ పిల్లలందరికీ జాతీయ సైన్సు దినోత్సవ సుభాశిస్సూలు తెలియచేసారు. పిల్లలు ప్రదర్శనకు ఉంచిన అంశాలు, నమూనాలు, బొమ్మలు అన్నీ చాల బాగా ఉన్నాయని ఉపాధ్యాయ బృందాని, పిల్లలను అభినందించారు. అలాగే  పుస్తక ప్రదర్శనలో ఉంచిన "తలవంచి నన్ను చదవండి - మీరు తలెత్తుకొని  తిరిగేలా నేను చేస్తాను" అని పుస్తకం చెప్పే మాటలున్న ఫ్లెక్సీ తమను బాగా ఆకట్టుకున్నదని. పిల్లలందరూ బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని వారు ఆశీర్వదించారు. మాబడిలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఉన్న రోజునే వారి కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు ఉన్నా, ఆ వేడుకలలో మధ్యాహ్నం వరకు వుండి వారి ప్రిన్సిపాల్ అనుమతి తీసుకొని మా బడిలో కార్యక్రమానికి హాజరు కావడం నిజంగా చాల అభినందనీయం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను. తరువాత బ్రహ్మసముద్రం మండలం గుండుగానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ  మల్లిఖార్జున గారు, కనుకూరు మోడల్ ప్రైమరీస్కూలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రీ నాగరాజు గారు, శ్రీ రాఘవేంద్ర గారు, కల్యాణదుర్గం మండలం మోరేపల్లి కొత్తూరు ఉపాధ్యాయులు శ్రీ బాలరామమోహన్ గారు ఒకరి తరువాత ఒకరు మాట్లాడుతూ  చాల విషయాలు చెప్పాలనుకున్న సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నామని చెప్పి  పిల్లలందరికీ జాతీయ సైన్సు దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. వీరందరికీ మా బడి తరఫున ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.   జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని పిల్లలకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన పిల్లల్లో  కొందరికి మాత్రమే(సమయాభావంవల్ల)  ముఖ్య అతిధులు ఆర్డీవో  శ్రీ రామారావు గారు, తహసిల్దార్  శ్రీమతి శ్రీవాణి గారి చేతులమీదుగా బహుమతులు ఇప్పించడం జరిగింది. మిగిలన విజేతలకు మరుసటి రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి బహుమతులను ఇవ్వడం జరిగింది.   ఈ కార్యక్రమం అనుకొన్నప్పటి నుంచి చివరి వరకు నాతోపాటూ శ్రమించి సహకరించిన మిత్రుడు మరియు భౌతికరసాయనశాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ సూరి బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో తమవంతు బాధ్యతలను చక్కగా నిర్వహించి కార్యక్రమం విజవంతం కావడానికి కారకులైన  మా బడి   ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి, పిల్లలకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా బ్లాగర్ మిత్రులకు   అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.














కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి