16, అక్టోబర్ 2015, శుక్రవారం

ఊహించని ఫలాలనిచ్చిన నాబడి నూతన ఒరవడి.

తన మిత్రుడి సూచనతో నా బ్లాగ్ "నాబడి నూతన ఒరవడి" ని చూసిన ఒక ఎన్నారై,  ప్రభుత్వ బడిలో నేను అవలంభిస్తున్న బోధనా పద్ధతులను, అమూర్తభావనల అభ్యసన కొరకు మూర్త భావనలతో పునాది అనే నా బోధనా సరళిని అభినందిస్తూ నాకు  ఫోన్ చేశారు. తన ఆలోచనలు నాతో పంచుకున్నారు. అతనితో మాట్లాడుతుంటే సాక్షాత్తు విజ్ఞాన గనితో మాట్లాడుతున్నట్టు అనిపించింది. పదోన్నతిమీద ఉన్నత పాఠశాలకు వెళ్ళిన నేను ప్రాథమిక పాఠశాలలో అవలంభించిన నూతన ఒరవడిని ఎలా కొనసాగించాలా అని ఆలోచిస్తున్న నాకు ఒక మార్గాన్ని దిశానిర్దేసం చేశారు తను. నా బడి నూతన ఒరవడికి పార్ట్ - 2 కి అన్నిరకాలుగా తనవంతు సహాయ సహకారాలని అందిస్తానాని తెలియచేసారు.  తను గతంలో లండన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో కొన్ని సంవత్సరాలు పని చేసిన అనుభవం కారణంగా తనకు విద్యా విధానం మీద, పలు బోధనా  పద్ధతుల మీద పూర్తి అవగాహన కలిగి వున్నారు. అంతేకాకుండా స్వతహాగా పుస్తకాలు బాగా చదివే అలవాటు వున్న కారణంగా చాల విషయాలమీద స్పష్టమైన అవగాహన కలిగి వున్నారు. తను  ప్రతి వారాంతాలలో నాకు ఫోన్ చేసేవారు.
ఫోన్ చేసిన ప్రతిసారి భోదనా పద్ధతుల మీద,  ప్రస్తుత విద్యా విధానం మీద చర్చించే వాళ్లము, ఆ చర్చల్లో భాగంగా మా బడిలో పిల్లలకు మన శాస్త్రవేత్తల గురించి పరిచయం చేయడంవల్ల వారిలో వున్నా అంతర్గత నైపుణ్యాలను శాస్త్రవేత్తలు కావాలనే కాంక్షను రగిలిన్చావచ్చని అనుకున్నాము. అనుకున్నదే తడవుగా తను మా బడి పిల్లలకోసం చెన్నై లోని ఐఐటి ప్రొఫెసర్ శ్రీ శ్రీనివాస చక్రవర్తి గారు వ్రాసిన  ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త శ్రీ జగదీశ్ చంద్ర బోస్ జీవిత చరిత్ర  "రెమ్మలు రమ్మన్నాయి" అనే పుస్తకాలను మరియు నాకు మరియు నా ఉపాధ్యాయ మిత్రులకు ఉపయోగపడే కొన్ని పుస్తకాలను కినిగే.కాం అనే ఆన్ లైన్ పుస్తకాల షాప్ ద్వారా నా అడ్రెస్సుకు  పంపించారు. దీనితో ఆపరేషన్ నో యువర్ ఏమినెంట్ సైంటిస్ట్స్ మొదలెట్టాను. ఆపరేషన్ నో యువర్ ఏమినెంట్ సైంటిస్ట్ లో భాగంగా 
ఆ రెమ్మలు రమ్మన్నాయి  పుస్తకాలను మా బడి లో కొందరి విద్యార్తులకు మా బడి ప్రధానోపాధ్యాయుల మరియు ఉపాధ్యాయుల  చేతులమీదుగాఎన్నారై గారి తరఫున అందచేసి, ఆ పుస్తకాన్ని చదివి వారి స్వంత మాటల్లో జగదీశ్  చంద్ర బోస్ గారి గురించి చెప్పాలని, వ్రాయాలని చెప్పడం జరిగింది. కొన్ని ప్రాథమిక ఇబ్బందులను అధిగమించి చివరకు పిల్లలు జగదీశ్ చంద్ర బోస్ గారి గురించి కొన్ని వాక్యాలు మాట్లాడ గలిగే స్తాయికి మరియు  వ్రాసే స్తాయికి వచ్చారు. మలి ప్రయత్నంలో సి.వి. రామన్ గారి పుస్తకాలను ఇంకా ఎక్కువమంది పిల్లలకు ఇచ్చి పిల్లలతో ఆపరేషన్ నో యువర్ ఏమినెంట్ సైంటిస్ట్స్ కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. ఇంతటి గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తున్న ఎన్నారై గారికి మా బడి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. పిల్లలకు సుభాశిస్సులు.