మా బడిలో జాతీయ సైన్సు దినోత్సవ వేడుకల సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన "విలువలు + విజ్ఞానం = వివేకం"(Values + Science or Knowledge = Wisdom) అనే అవగాహన సదస్సు మరియు జాతీయ సైన్సు దినోత్సవ ఆవిర్భావానికి కారణమైన రామన్ ఫలితం మరియు సర్ సి.వి.రామన్ గారి గురించి అవగాహనా సమావేశానికి ముఖ్య అతిథులుగా కల్యాణదుర్గం ఆర్డీవో శ్రీ రామారావు గారు, శెట్టూరు తహసిల్దార్ శ్రీమతి శ్రీవాణి గారు, కనుకూరు గ్రామ సర్పంచ్ శ్రీ రామన్న గారు, కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు శ్రీ అక్బర్ గారు, వారి విభాగ అధిపతి శ్రీమతి గోపీ కృష్ణవేణి గారు, రసాయనశాస్త్ర విభాగ అధిపతి శ్రీమతి హర్ష లత గారు, బ్రహ్మసముద్రం మండలం గుండుగానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మల్లిఖార్జున గారు, కనుకూరు మోడల్ ప్రైమరీస్కూలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రీ నాగరాజు గారు, శ్రీ రాఘవేంద్ర గారు, కల్యాణదుర్గం మండలం మోరేపల్లి కొత్తూరు ఉపాధ్యాయులు శ్రీ బాలరామమోహన్ గారు , గ్రామ మాజీ సర్పంచ్ హనుమంత గౌడ్ గారు విచ్చేశారు. తొలుత ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్యాణదుర్గం ఆర్డీవో రామారావు గారు మా బడి పిల్లల్ని ఉద్ధేశించి మాట్లాడుతూ పిల్లలు ముఖ్యంగా మూడు విషయాలు చిన్నప్పటి నుంచే అంటే పాటశాల స్థాయి నుంచే అలవరచు కోవాలని అవి 1. నైతిక విలువలు, 2. మంచి అలవాట్లు, ౩. నాణ్యమైన చదువు అని తెలియ చేసారు. మొదటి అంశమైన నైతికవిలువలుకు ఉదాహరణగా పిల్లలు అపద్దాలు చెప్పకూడదని పిలుపునిచ్చారు. ఈనాటి ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యా వైజ్ఞానిక అంశాలతోపాటూ స్వామీ వివేకానందుని చిత్రమాలిక మరియు స్వామీ వివేకానంద పుస్తకాలు ప్రదర్శనకు, అమ్మకాలకు ఉంచి విజ్ఞానం విలువలు రెండూ రెండు కళ్ళవంటివనీ, నేటి తరం విద్యార్థులకు అవి రెండూ ఎంతో అవసరమని తెలియచేసారు. అలాగే ఆనాటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఏర్పాటుచేసి ప్రదర్శించిన అంశాలలో ఒకటైన "పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం" (smoking is injurious to health) అనే అంశం తనను చాలా బాగా ఆకట్టుకున్నదని తెలియచేస్తూ, జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాటశాల పిల్లలందరితో "మేము పొగత్రాగము" అని ప్రతిజ్ఞ చేయించే కార్యక్రమం తన మనసులో ఉందని, ఆ కార్యక్రమాన్ని మన కనుకూరు ఉన్నత పాటశాల పిల్లలతోనే ప్రారంభింస్తే బాగుంటుందని చెప్పి ఆదిశగా ఆలోచించమని మాకు సూచించారు. అలాగే ఇటువంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను డివిజన్ కేంద్రమైన కల్యాణదుర్గంలో డిగ్రీ కళాశాల వారి సమన్వయంతో నిర్వహించాలని మా బడి పిల్లలు అలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటే బాగుంటుందని ఆ దిశగా ఆలోచించమని ఆ సమావేశ వేదికపై వున్న డిగ్రీ కళాశాల అధ్యాపకులను కోరారు. ఆర్డీవో శ్రీ రామారావు గారు ఒకవైపు అంతకుముందు రోజే లేపాక్షి ఉత్సవాలలో పాల్గొని రాత్రి ఆలశ్యంగా ఇంటికిచేరి బడలికతో ఉన్నా, మరోవైపు డివిజినల్ స్థాయిలో మండల తహసిల్దార్లతో నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా మా అభ్యర్థనను మన్నించి, ప్రభుత్వ బడులనూ, ప్రభుత్వ బడులలో పిల్లల్నీ, ప్రభుత్వ బడుల ఉపాధ్యాయులనూ ప్రోత్సహించాలనే సదుద్దేశంతో (తానూ స్వంతంగా మనసులో సంకల్పంతో ఏర్పరచుకున్న "రామారావ్ విద్య మిషన్" ప్రక్రియలో భాగంగా ) డివిజన్ కేంద్రానికి అత్యంత దూరములో (35 కిలోమీటర్లు) ఉన్న మాబడికి విచ్చేసి మా బడి పిల్లల్ని, మమ్మల్ని ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆశీర్వదించిన శ్రీ రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే శ్రీ రామారావు గారు కోరుకున్న విధంగా ఉన్నత పాటశాల విద్యార్థులతో మేము పోగాత్రాగము అనే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని త్వరలోనే ఆచరణలోకి తీసుకొచ్చి మొదట మా బడి పిల్లలతో తరువాత మండలం, డివిజన్ మరియు జిల్లా స్థాయిలో ఉన్న అన్ని ఉన్నత పాటశాలల విద్యార్ధులందరితో చేపట్టే విధంగా వారి సహకారంతోనే కృషి చేస్తామని తెలియచేసుకుంటున్నాను. తరువాత మా మిత్రుడు శ్రీ అక్బర్ గారు మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవ ఆవిర్భావానికి కారణమైన రామన్ ఫలితం గురించి, సర్ సి.వి. రామన్ గారి గురించి క్లుప్తంగా వివరించారు. భారతదేశంలోని తొలితరం శాస్త్రవేత్తలు చరకుడు, ధన్వంతరి మొదలు ఆధునిక శాస్త్రవేత్తలైన డాక్టర్ రాజ్ రెడ్డి, రాజారామన్న, స్వామినాథన్ల గురించి చెప్పారు. అంతే కాకుండా మారు మూల గ్రామాలలో పుట్టి, కటిక పేదరిక నేపథ్యం నుంచి ఎంతో ఇష్టంతో చదువుకొని జాతీయ స్థాయిలో రాణించిన మరియు రాణిస్తున్న రాయలసీమకు చెందిన వృక్షశాస్త్ర ప్రోఫెసర్లై అనేక పుస్తకాలు వ్రాసి, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో వివిధ విద్యా సంబంధ శాఖలకు నేతృత్వం వహించిన తమ్మినేని పుల్లయ్య గారు, సుంకర రామంజులు గారు, చింత సుధాకర్ గార్ల గురించి మా బడి పిల్లలకు చెప్పి వీరు కూడా మీరున్నటువంటి మారు మూల పల్లెలాంటి పల్లెలనుండే వచ్చి పేదరికాన్ని ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరారని కనుక మీరు కూడా అలాగే ఇష్టపడి కష్టపడి చదివి బడికి, ఉపాధ్యాయులకు, గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరారు. మరోసారి మా కనుకూరు బడికి వచ్చి ఒకరోజంతా పిల్లలకు సైన్సు సంబంధించిన విషయాలు చర్చిస్తానని చెప్పారు, వీరి తరువాత శ్రీమతి గోపీ కృష్ణ వేణి మేడం గారు, శ్రీమతి హర్షలత మేడం గారు మాట్లాడుతూ పిల్లలందరికీ జాతీయ సైన్సు దినోత్సవ సుభాశిస్సూలు తెలియచేసారు. పిల్లలు ప్రదర్శనకు ఉంచిన అంశాలు, నమూనాలు, బొమ్మలు అన్నీ చాల బాగా ఉన్నాయని ఉపాధ్యాయ బృందాని, పిల్లలను అభినందించారు. అలాగే పుస్తక ప్రదర్శనలో ఉంచిన "తలవంచి నన్ను చదవండి - మీరు తలెత్తుకొని తిరిగేలా నేను చేస్తాను" అని పుస్తకం చెప్పే మాటలున్న ఫ్లెక్సీ తమను బాగా ఆకట్టుకున్నదని. పిల్లలందరూ బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని వారు ఆశీర్వదించారు. మాబడిలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఉన్న రోజునే వారి కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు ఉన్నా, ఆ వేడుకలలో మధ్యాహ్నం వరకు వుండి వారి ప్రిన్సిపాల్ అనుమతి తీసుకొని మా బడిలో కార్యక్రమానికి హాజరు కావడం నిజంగా చాల అభినందనీయం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను. తరువాత బ్రహ్మసముద్రం మండలం గుండుగానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మల్లిఖార్జున గారు, కనుకూరు మోడల్ ప్రైమరీస్కూలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రీ నాగరాజు గారు, శ్రీ రాఘవేంద్ర గారు, కల్యాణదుర్గం మండలం మోరేపల్లి కొత్తూరు ఉపాధ్యాయులు శ్రీ బాలరామమోహన్ గారు ఒకరి తరువాత ఒకరు మాట్లాడుతూ చాల విషయాలు చెప్పాలనుకున్న సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నామని చెప్పి పిల్లలందరికీ జాతీయ సైన్సు దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. వీరందరికీ మా బడి తరఫున ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను. జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని పిల్లలకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన పిల్లల్లో కొందరికి మాత్రమే(సమయాభావంవల్ల) ముఖ్య అతిధులు ఆర్డీవో శ్రీ రామారావు గారు, తహసిల్దార్ శ్రీమతి శ్రీవాణి గారి చేతులమీదుగా బహుమతులు ఇప్పించడం జరిగింది. మిగిలన విజేతలకు మరుసటి రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి బహుమతులను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అనుకొన్నప్పటి నుంచి చివరి వరకు నాతోపాటూ శ్రమించి సహకరించిన మిత్రుడు మరియు భౌతికరసాయనశాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ సూరి బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో తమవంతు బాధ్యతలను చక్కగా నిర్వహించి కార్యక్రమం విజవంతం కావడానికి కారకులైన మా బడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి, పిల్లలకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా బ్లాగర్ మిత్రులకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
22, మార్చి 2016, మంగళవారం
21, మార్చి 2016, సోమవారం
సాంస్కృతిక మరియు భోజన కార్యక్రమాల చిత్రమాలిక - మా బడిలో జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు - 2016 సందర్భంగా ....
మా బడిలో జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు - 2016 సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను చూడడానికి మా బడి పిల్లలు కాకుండా మండల పరిధిలోని వివిధ బడులనుండి(ఎర్రంపల్లి, ఎర్రబోరే పల్లి, ముచ్చర్ల పల్లి ప్రాథమికోన్నత పాటశాలలు, కనుకూరు మోడల్ ప్రైమరీస్కూలు, ములకలేడు, చెర్లోపల్లి ఉన్నత పాటశాలలు) సుమారు 450 మంది పిల్లలు, సుమారు 70 మంది పెద్దలు ( ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు) వచ్చారు. వీరందరికీ సాదరంగా స్వాగతం పలికి, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను చూసే ముందు , చూసిన తరువాత మంచి నీళ్ళు, కాఫీ, భోజనాలు ఏర్పాటు చేయడంలో మా ఉపాధ్యాయ బృందం (సోమశేఖర్ గారు, సూరిబాబు గారు, శ్రీనివాసులు గారు, నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు, లక్ష్మన్న గారు, సురేష్ బాబు గారు) మాజీ విద్యా వాలంటీర్ బషీర్ గారు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు మర్రిస్వామి గారు, మా మిత్రుడు పర్వతయ్య గారు గ్రామస్తులు కొందరు, వాలంటీర్ పిల్లలు ఎటువంటి లోటు రాకుండా చూసుకున్నారు. వీరిని ప్రధానోపాధ్యాయులు మల్లిఖార్జున గారు చక్కగా సమన్వయ పరిచారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను చూసిన తరువాత భోజనాలు చేసే వరకు పిల్లల్ని, ఉపాధ్యాయులను సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడంలో మా ఉపాధ్యాయులు నాగేంద్ర గారు, కనుకూరు ప్రైమరీస్కూలు ప్రధానోపాధ్యాయులు నాగరాజు గారు ముఖ్య భూమిక నిర్వహించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. పిల్లల్ని మా బడిలో జరిగే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను చూపించడానికి ఓపికతో పిల్చుకొని వచ్చిన ఉపాధ్యాయులకు, అందుకు అనుమతి ఇచ్చిన ఆయా బడుల ప్రధానోపాధ్యాయులకు ఈ సందర్భంగా మా బడి తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
మా బడిలో పర్యావరణ పరిరక్షణ కొరకు "హరిత సేన" ఏర్పాటు చిత్రమాలిక - జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు -2016 సందర్భంగా
మా బడిలో పర్యావరణ పరిరక్షణ కొరకు "హరిత సేన" ఏర్పాటు చేయాలని సైన్సు క్లబ్ లో సైన్సు ఉపాధ్యాయులు, పిల్లలు అనుకొని ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకొన్నాం. మా బడిలో హరిత సేన ఏర్పాటులో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం బడి పిల్లలందరూ కృషి చేయాలనీ, అలా విశేష కృషి చేసిన వారిలో అబ్బాయిలకు "యంగ్ ఎకో సేవియర్ " (YES: Young Eco Saviour) అవార్డులను, అమ్మాయిలకు "గ్రీన్ ఎన్విరాన్మెంట్ మెంబర్"(GEM: Green Environment Member) అవార్డులను ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ అవార్డులు పొందిన విద్యార్థినీ విద్యార్థులకు ముదురు నారింజ రంగు టోపీలను, ఆకుపచ్చ రంగు షోల్డర్ కెర్చీఫ్ లను, స్టార్లను, త్రివర్ణ బ్యాడ్జీలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఇలా ఇవ్వడం ద్వారా వారికొక గుర్తింపు ఇచ్చినట్లుంటుంది మరో రకంగా వారి బాధ్యతలను రెట్టింపు చేసి వారిలో చదువుతో బాటుగా పర్యావరణ పరిరక్షణ అనే సామాజిక బాధ్యతను పెంపొందిచినట్లవుతుంది అని భావించడం జరిగింది. అనుకున్నదే తడవుగా బడి నిధులనుంచి కొంత డబ్బుతో బెంగుళూరులో వుండే మా బంధువులబ్బాయి వినోద్ ను సంప్రదించగా అతను తాను వుండే ప్రాంతం నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే నేను చెప్పిన షాప్ కెళ్ళి, నా ఫోన్ సూచనలకు అనుగుణంగా(వాట్సాప్ ద్వారా) తక్కువ ధరకే టోపీలను, స్టార్లను , త్రివర్ణ బ్యాడ్జీలను కొనుగోలు చేసి నాకు జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలకు చాలా ముందుగానే అందేటట్లు చేసాడు. అలాగే ఆకుపచ్చ రంగు గుడ్డను షోల్డర్ కెర్చీఫ్ లుగా కుట్టి ఇవ్వడంలో ఉపాధ్యాయ మిత్రుడు పర్వతయ్య సహకరించారు. వినోద్ కు మరియు పర్వతయ్య గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. జాతీయ సైన్సు దినోత్సవ వేడుకల రోజున కొందరు ఎంపిక చేయబడ్డ విద్యార్థినీ విద్యార్థులకి గ్రామ సర్పంచ్ శ్రీ రామన్న, లాయరు శ్రీ శేషాద్రి, శెట్టూరు ఏ పీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ శ్రీరాములు, కనుకూరు మోడల్ ప్రైమరీస్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ నాగరాజు గార్ల చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. వీరందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
భవిష్యత్తులో బడిలోని పిల్లలందరికీ పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించి వారు దాని కోసం నడుం బిగించేలా చేసి బడిలోని విద్యార్థినీ విద్యార్థులందరికీ ఈ అవార్డులు ఇచ్చి అందరి పిల్లలను ఈ హరిత సేనలో భాగస్వామ్యులయ్యేటట్లు చేసి హరితాంధ్రప్రదేశ్ సాధనలో మా వంతు భాద్యత నేరవేర్చేలా అడుగులు వేస్తున్నాము....
16, మార్చి 2016, బుధవారం
శాస్త్రవేత్తల పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు మరియు స్వామీ వివేకానంద పుస్తకాల ప్రదర్శన మరియు అమ్మకాలు - మా బడిలో జాతీయ సైన్సు దినోత్సవం వేడుకలు సందర్భంగా
మా బడిలో జాతీయ సైన్సు దినోత్సవం వేడుకల సందర్భంగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకొంటున్నాము అని బ్లాగర్ మిత్రులకు వారు ఫోన్ చేసిన సందర్భంగా తెలియచేయగానే సాంప్రదాయబద్దంగా మూస పద్ధతిలో కాకుండా మీ బడిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను విభిన్నంగా ఏర్పాటు చేయాలనీ..., దానికోసం మా బడి పిల్లలకు, ప్రదర్శన చూడడానికి వచ్చిన వివిధ బడుల్లోని పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు ఉపయుక్తంగా ఉండేలాగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనతో బాటు..., సైన్సు , శాస్త్రవేత్తల పుస్తకాల ప్రదర్శనకు వుంచి వాటిని తగు రాయితీతో అమ్మకాలకు కూడా ఉంచమని చెప్పారు. అంతేకాకుండా మంచి పౌరులుగా పిల్లలు ఎదగాలంటే విజ్ఞానమే కాదు ఉన్నత విలువలు వారికి అలవరచాలనీ మరియు ఎటువంటి క్లిష్ట పరిస్తితుల నైనా సమర్ధవంతంగా ఎదుర్కొనే ఆత్మవిస్వాసం పిల్లల్లో ఇప్పటినుంచే ప్రోదిచేయాలని ..., అందుకు ఉపయుక్తంగా ఉండే స్వామీ వివేకానంద గారి పుస్తకాలను కూడా ప్రదర్శనకు మరియు అమ్మకాలకు వుంచాలని సూచించారు. మరి ఈ పుస్తకాలన్నింటినీ తెచ్చి ప్రదర్శనకు అమ్మకాలకు ఉంచాలంటే సుమారు పదిహేను వేల రూపాయలు అవసరమౌతుంది. నారు పోసినవాడు నీరుపోయడా? అనే చందాన సలహా ఇచ్చిన బ్లాగర్ మిత్రులు సలహా అమలుకు కావలసిన పుస్తకాలను వారే స్వయంగా ఆన్ లైన్ షాపింగ్ పద్ధతిలో "మంచి పుస్తకం డాట్ కాం" వారి ద్వారా విలువైన మరియు అరుదైన సైన్సు మరియు శాస్త్రవేత్తల పుస్తకాలను విద్యా వైజ్ఞానిక ప్రదర్శన తేదీ కన్నా చాల రోజుల ముందుగానే నాకు అందేలా చేశారు. మరి ఆన్ లైన్లో దొరకని స్వామీ వివేకానంద గారి పుస్తకాలను వాటితో పాటు అబ్దుల్ కలాం గారి పుస్తకాలను, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుస్తకాలను రామకృష్ణ మటం మరియు ప్రముఖ పుస్తకాల షాప్ ల నుండి హైదరాబాదు లోని బ్లాగర్ మిత్రులు విజయ్ గారి ద్వారా కొనుగోలు చేయించి పార్సిల్ సర్వీసు ద్వారా నాకు సకాలంలో అందేలాగా చేశారు. వీటితోబాటు ఆరోగ్యం - ఆహారం సంబంధించి ప్రముఖ రచయిత డాక్టర్ జీ వీ పూర్ణ చందు గారి పుస్తకాలను "కినిగే డాట్ కాం" ద్వారా నాకు అందేలాగా చేశారు. ఈ పుస్తకాలన్నిటినీ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఒక గదిలో ప్రదర్శనకు మరియు అమ్మకాలకు వుంచడం జరిగింది. వీటితోపాటూ పెద్దలు శ్రీధర మూర్తి గారి సౌజన్యంతో (రామకృష్ణ మటం అనంతపురం) నరేంద్రుడు స్వామీ వివేకానందగా పరివర్తన చెంది భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పి భారతదేశాన్ని ప్రపంచలో సమున్నత స్థానంలో నిల్పిన వివిధ దశల చిత్రపటాల మాలికను కూడా ఆ గదిలో ప్రదర్శనకు వుంచడం జరిగింది. ఈ ప్రదర్శనకు విచ్చేసిన కొలిమిపాల్యం ఉన్నత పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీధర్ గారిని పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంబించమని కోరగా వారు మా బడి చిన్నరితోనే పుస్తక ప్రదర్శనను ప్రారంభింప చేసి పిల్ల పట్ల వారికున్న ప్రేమను చాటుకున్నారు. అలాగే ప్రదర్శనను చూసి చాల బాగుందని మమ్మల్ని అభినందించి కొన్ని పుస్తకాలను కొనుగోలు చేశారు, అంతేకాకుండా 700 రూపాయలను మాకు ఇచ్చి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వామ్యులైన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఉపయుక్తమైన పుస్తకాలను బహుమతులుగా ఇవ్వమని చెప్పి పిల్లల పట్ల తన ప్రేమను మరొకసారి చాటుకున్నారు. వారి కోరికమేరకు ఆ విద్యార్థులందరికీ పుస్తకాలను బహుమతులుగా వారి పేరుమీదుగా ఇవ్వడం జరిగింది. ప్రదర్శన చూడడానికి వచ్చిన గ్రామ సర్పంచ్ శ్రీ రామన్న గారు 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి కొన్ని పుస్తకాలు కొనుక్కోవడం జరిగింది. తరువాత పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ కలిసి సుమారు ఆరు వేల రూపాయల పై చిలుకు విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేశారు. పుస్తకాల అమ్మకాల ప్రక్రియను పర్యవేక్షించడానికి హిందీ పండితులు సురేష్ బాబు గారిని కోరగా వారు ఆ బాధ్యతలను సంతోషంగా స్వీకరింఛి విజయవంతగా పూర్తి చేశారు. ఇలా పుస్తకాలను అమ్మగా వచ్చిన డబ్బుకు మరికొంత డబ్బును విరాళంగా సేకరించి మొత్తం డబ్బును ఈ మధ్యనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టిన గంగా నది ప్రక్షాళన కార్యక్రమమైన నమామి గంగే ప్రాజెక్టు కు విరాళముగా డీ.డీ. రూపములు మా బడి తరఫున పంపాలని నిర్ణయించుకున్నాము. మా బడిలో మేము చేస్తున్న నూతన ఒరవడి యొక్క వడినీ, వాడినీ పెంచే విధంగా నూతన సొబగులద్డుతున్న బ్లాగర్ మిత్రులకు, మాకు ఎల్లవేళలా సహకారం అందిస్తున్న గ్రామ సర్పంచ్ రామన్న గారికి , ఆర్డీవో శ్రీ రామారావు గారికి, ఎమ్మార్వో శ్రీ వాణి గారికి, కొలిమిపాల్యం ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీధర్ గారికి, ఈ కార్యక్రమం విజవంతం కావడానికి తోడ్పడ్డ వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)